Apr 03,2023 23:25

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. అరసం జిల్లా కన్వీనర్‌ పడాల వీరభద్రరావు స్వాగతం పలుకగా, ప్రజానాట్యమండలి బందం అద్భుత గానాలాపనలతో కార్యక్రమం మొదలైంది. అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్‌ సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ తొలుత కందుకూరి వీరేశలింగం దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1936లో లక్నోలో అరసం మొదలైందని, 1943లో తెనాలిలో రాష్ట్ర అరసం ప్రథమ మహాసభ జరిగిందని తెలిపారు. కవులు తమ కవితలతో అమూల్యమైన జీవితాలలో మార్పులు తెచ్చి, చైతన్య స్రవంతి మార్గంలో అభ్యుదయంపై పయనింపజేస్తారని తెలిపారు. అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఓబులేసు, ఎస్‌.ఆర్‌.పథ్వి, చెరుకుమల్లి సింగారావు, ఆదిత్య డైరెక్టర్‌ ఎస్‌పి.గంగిరెడ్డి మాట్లాడారు. అనంతరం జిల్లా శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా డాక్టర్‌ కర్రి రామారెడ్డి, అధ్యక్షునిగా పడాల వీరభద్రరావు, ఉపాధ్యక్షునిగా డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ, డాక్టర్‌ జనపాల కాళేశ్వరరావు, పధాన కార్యదర్శిగా ఎస్‌ఆర్‌.పృథ్వి, కార్యదర్శులుగా బిహెచ్‌.వి.రమాదేవి, పెనుమాకుల భాస్కరరావు ఎన్నికయ్యారు.