ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
గహ వినియోగ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారం సాకుతో క్రమక్రమంగా గ్యాస్‌పై రాయితీని తొలగించిన విషయం విధితమే. కేవలం ఉజ్వల్ కనెక్షన్‌లున్న లబ్ధి దారులకు మాత్రమే రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అదికూడా ఒక్కో సిలిండర్‌కు సగటున రూ.10.50 మాత్రమే రాయితీ ఇస్తూ వస్తోంది. మరోవైపు ప్రతిరోజు జిల్లాలో వందలాది సిలిండర్లు వాణిజ్య అవసరాలకు తరలిపోతున్నాయి. అక్రమార్కులపై కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్యాలను చేరుకోవడానికి కొందరు కంపెనీల ప్రతినిధులే ప్రోత్సహిస్తున్నారు. గ్యాస్ కంపెనీలకు లబ్ధిదారుల పేరుతో నేరుగా గ్యాస్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో పెద్ద మొత్తంలో గ్యాస్ పక్కదారి పట్టేందుకు కారణమవుతోంది. జిల్లాలో సుమారు 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. ప్రతిరోజూ జిల్లాలో 8వేల గహ వినియోగ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. అందులో నాలుగో వంతు అంటే 2వేల సిలిండర్లు పక్క దారి పట్టి వ్యాపార అవసరాలకు తరలిపోతున్నట్టు సమాచారం.
లక్ష్యం చేరుకోవడమే ప్రధానం
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల పక్కదారి పట్టడంలో తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు అందరి ప్రమేయం ఉంది. ప్రభుత్వం రాయితీలో కోత విధించడంతో కంపెనీలకు పూర్తిస్థాయి సొమ్ము వసూలు అవుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కంపెనీలకే రాయితీ జమ చేసింది. సెంట్రల్ పూల్ కింద రాయితీ జమయ్యేది. అయితే సక్రమంగా కంపెనీలకు జమచేసేది కాదు. రాయితీ విధానంలో కేంద్రం మార్పులు చేసింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. కంపెనీలపై రాయితీ భారం తగ్గింది. దాంతో అమ్మకాలు అధి కంగా నిర్వహించాలని గ్యాస్ కంపెనీలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. కంపెనీలే నేరుగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. దాంతో కంపెనీ ప్రతినిధులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేస్తున్నారు. ఆయా డీలర్ల పరిధి లోని లబ్ధి దారుల పేరుతో గ్యాస్ సిలెండర్‌లు కేటాయిస్తు న్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులు వాటిని తీసుకోవడం లేదు. దాంతో కొందరు డీలర్‌లు అటువంటి సిలిండర్లను హోటళ్లకు మళ్లించేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో లబ్ధిదారులపై భారం
జిల్లాలో ప్రతిరోజు 2000 సిలిండర్లు పడుతున్నాయి. ఏడాదికి దాదాపు రూ.66 కోట్లు నష్ట పోతున్నట్టు అంచనా. చివరకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రాయితీ ఇవ్వలేనంటూ లబ్ధిదారులపై భారం మోపుతోంది. గహ వినియోగ గ్యాస్‌కు గతంలో డిమాండ్ ఉండేది. బుక్ చేసుకున్న వారం రోజులకు గ్యాస్ సరఫరా అయ్యేది కాదు. అప్పట్లో పౌర సరఫరాల శాఖ అజమాయిషీ ఉండేది. డీలర్లకు సరఫరా అయ్యే గ్యాస్‌పై దృష్టి పెట్టేవారు. ప్రతి రోజు లెక్కలు తీసుకునేవారు. హోటళ్లను తనిఖీ చేసి గృహ వినియోగ గ్యాస్ వినియోగిస్తే చర్యలు ఉండేవి. కనెక్షన్‌లు సీజ్ చేసేవారు. జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం వంటగ్యాస్ సరఫరాలో బ్యాక్‌లాగ్ అనే పరిస్థితి లేదు. మరో వైపు పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత వెంటా డుతోంది. ఫలితంగా డీలర్ల నుంచి సమాచారం సేకరించ డం లేదు. తనిఖీలు చేపట్టడం లేదు. ఈ పరిణామాలు గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఆర్థికంగా లాభాన్ని చేకూర్చుతున్నాయి. ప్రజలపై భారం పడుతోంది.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్‌లను మాత్రమే వినియోగించాలి. గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాుం. కొనుగోలుదారులతో పాటు సహకరించిన ఏజెన్సీ నిర్వహకులపైనా చర్యలు ఉంటాయి.
- ప్రసాదరావు, డిఎస్‌ఒ, తూర్పుగోదావరి జిల్లా










