ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ఉండేలా వ్యక్తిగతంగా కృషి చేయాలన్నారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో శిక్షణను అందించి వారిని పై తరగతులకు పంపించే విధంగా ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అవసరం మేరకు సబ్జెక్టు వారీగా ఫ్యాకల్టీని సిద్ధం చేసి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. వసతి గృహాల వార్డెన్స్ హాస్టల్స్‌లోనే ఉంటూ విద్యార్థుల అభివృద్ధికి నిబద్ధతతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి డిఎస్.సునీత, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి ఎం.సందీప్, ఇఎఒ కె.నందీష్, గురుకులాల కో ఆర్డినేటర్ జి.రాజకుమారి పాల్గొన్నారు.










