Jan 31,2023 23:14

కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న పూర్ణిమారాజు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
ఎపి పేపర్‌మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు డిమాండ్‌ చేశారు. కార్మికులు చేస్తున్న రిలే నిరసన దీక్షలు మంగళవారం నాటికి 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి, జిల్లా నాయకులు మాణిక్యాంబ, అన్నపూర్ణ, సుబ్బలక్ష్మి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ 21 రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మొండి వైఖరిని వదిలి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. క్యాంటీన్‌ రేట్లను తక్షణమే తగ్గించాలని, కాంట్రాక్టు కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను బాగుచేయించి తక్షణమే కార్మికులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలవెన్సులు వెంటనే ఇవ్వాలన్నారు. ఎపి పేపర్‌ మిల్లు కార్మికుల పోరాటానికి సిఐటియు, అనుబంధ సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయన్నారు. నేటి దీక్షలో వి.రాంబాబు, ఎం.రామకృష్ణ, విక్రమ్‌, వై.అప్పారావు, బి.శ్రీనివాస్‌ కూర్చొన్నారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు, అంగన్‌వాడీలు మాణిక్యాంబ, అన్నపూర్ణ, సుబ్బలక్ష్మి, రామలక్ష్మి, మార్త, మాలతి, సూర్యకుమారి, కల్యాణి, దుర్గ, శ్రీదేవి, రమాదేవి మద్దతు తెలిపారు.