కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో
రోగుల ఆవేదన
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - కడియం
కోట్లాది రూపాయలతో ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని పూర్తి కూడా చేశారు. ఖరీదైన వైద్య పరికరాలను, మౌలిక వసతులలో భాగంగా కొన్ని రకాల వస్తువులను గతంలోనే దాతలు సమకూర్చారు. పూర్తిస్థాయి వైద్య సిబ్బందితో ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలను సైతం అందిస్తున్నారు... కాని ఇక్కడ రోగులకు గుక్కెడు మంచినీళ్లను మాత్రం అందించలేకపోతున్నారు. వేసవి తీవ్రతతో ఇప్పటికే జనం అల్లాడుతున్నారు. ఇక రోగుల పరిస్థితి మరింత దారుణం. ఎండలో పడొచ్చి గుక్కెడు నీటితో గొంతు తడుపుకునే వీలు లేక వారు నాని ఇబ్బందులు పడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం ఆంధ్ర పేపర్ మిల్ వారు రోగుల సౌకర్యార్థం తాగునీటి కూలర్‌ను ఆసుపత్రికి సమకూర్చారు. కొన్నాళ్లపాటు రోగులు, ఆసుపత్రి సిబ్బంది దీని ద్వారా దాహార్తిని తీర్చుకున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఇది రోగులకు దూరమైంది. ఆసుపత్రి లోపల మంచినీళ్లు సరఫరా చేసే శీతల పానీయం అందించే మరో చిన్న యంత్రం కూడా ఉంది. దాని ద్వారా కూడా ఏడాదికో పండుగ అన్నట్లు అప్పుడప్పుడూ మాత్రమే తాగునీరు లభిస్తుంది. నిత్యం వందలాది మంది రోగులు వైద్య సేవలు పొందడానికి వస్తుంటారు. పదుల సంఖ్యలో బాలింతలు ప్రతి రోజూ వస్తుంటారు. కొంత మంది రోగులు ఆసుపత్రిలో ఉండి రోజుల తరబడి వైద్య సేవలు పొందుతున్నారు. గుక్కెడు నీళ్లు అందడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ, పాలకులు ఈ చిన్నపాటి సమస్యను పరిష్కరించి, రోగుల దాహర్తిని తీర్చాలని పలువురు కోరుతున్నారు.










