ప్రజాశక్తి - చాగల్లు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నమోదైన కేసులపైనే సిఐడి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని హోంమంత్రి డా.తానేటి వనిత అన్నారు. మండలంలోని నెలటూరు గ్రామంలో బుధవారం నూతనంగా మంజూరు అయిన పింఛన్లను లబ్ధిదారులకు ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక నేరాలు మోపరని ఆరోపించారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసులను ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నమోదైన కేసులు చట్టపరంగా సిఐడి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాను హోం మంత్రిగా ఉండి పోలీసులను తప్పు చేయమంటే తప్పు చేస్తారా ? అని ప్రశ్నించారు. చట్ట పరంగా కేసు నమోదు అయితేనే చర్యలు చేపడతారని తెలిపారు. 2018 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు రిజర్వేషన్ నావల్ల కాదు అన్నారు అప్పుడు చాలామంది ఇలా మాట్లాడారని కార్యకర్తలు ఆందోళన చెందారని, తర్వాత పాదయాత్రలో ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలు పాదయాత్రలో పాల్గొనడంతో అదే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముందుచూపును చూసి అభినందించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారని అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా ఉండాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్ట వీరస్వామి, పలువురు ప్రజాప్రతినిధులు, ఎంపిడిఒ బొలిశెట్టి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










