ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. రీసర్వే, ఇంటి స్థలాలు, పర్యాటకం, వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వర్చువల్ విధానంలో సమీక్షించారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత, జెసి ఎన్.తేజ్‌భరత్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. పంచాయితీ స్థాయి వరకు లాగిన్‌లు ఇచ్చామన్నారు. పిఎంయులు, ఆడిట్ టీమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. రెవెన్యూ అంశాలకు చెందిన అర్జీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మండలాల్లో ఏర్పాటైన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో ఎస్‌హెచ్‌ఒలు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు చాలా వరకు పరిష్కారం చేశారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాధవీలత అధికారులతో మాట్లాడారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తప్పనిసరిగా బియాండ్ ఎస్‌ఎల్‌ఎకు వెల్లకుండ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఇళ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పునాది పడిన నిర్మాణాలకు పొదుపు సంఘాల ద్వారా అదనపు రుణం అందేలా చూడాలన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. వర్షాకాలంలోపు గహ నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సామూహిక గహ ప్రవేశాలు తొందరలోనే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పురోగతి ఉండాలని సూచించారు.జిల్లాలో చేపడుతున్న జగనన్న భూహక్కు - భూ రక్ష రీసర్వేను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులు భూసేకరణకు చెందిన పరిహారం జిల్లాకు అందిన మొత్తాన్ని త్వరితగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద కస్టమర్ హైరింగ్ సెంటర్ గ్రూపులకు మెషినరీ సబ్సిడీపై అందించి, ఆర్‌బికె స్థాయిలో అందుబాటులో ఉంచి తక్కువ అద్దెతో వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, జిల్లా హౌసింగ్ అధికారి పరశురామ్, జిల్లా పశుసంవర్థక శాఖా అధికారి ఎస్‌జివి.సత్యగోవింద్, వ్యవసాయశాఖ జెడి ఎస్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.










