Feb 03,2023 22:45

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో పలు పట్టణాలతో పాటు కీలక మండల కేంద్రాల్లో భవన నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. నెల రోజులుగా సిమెంటు, స్టీల్‌ ధరలు అంతకంతకూ పెరగడమే కారణమని బిల్డర్లు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో భవన నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. ఈ ప్రకారమైతే సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గాలి. ఇందుకు విరుద్ధంగా వాటి ధరలు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వల్ల సగానికి పైగా పతనమైన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ధరల పెంపుతో నిర్మాణాలు కుదేలై వ్యాపారాలు కూడా తగ్గిపోతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరల వల్ల ఆరు నెలలు క్రితంతో పోలిస్తే సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి నిర్మాణానికి రూ.3 నుంచి రూ. 4 లక్షలు అదనపు భారం పెరిగిందని చెబుతున్నారు.
స్టీల్‌ టన్నుపై రూ.5 వేల పెంపు
స్టీల్‌ ధరలు వారంలో టన్నుపై రూ.5 నుంచి 6 వేలు పెరిగింది. ప్రముఖ కంపెనీల గ్రేడ్‌-1 రకం స్టీల్‌ వారం క్రితం టన్ను రూ.73 వేలు ఉంటే.. తాజాగా రూ.78 వేలకు చేరింది. టన్నుపై రూ.5 వేలు పెరిగింది. విశాఖ స్టీల్‌ రూ.65 వేల నుంచి రూ.71 వేలకు చేరింది. అంటే.. రూ.6 వేలు పెరిగింది. సాధారణ కంపెనీలకు చెందిన గ్రేడ్‌-2 రకం స్టీల్‌ రూ.56 వేల నుంచి రూ.61 వేలకు చేరింది. టన్నుపై రూ.5 వేలు పెరిగింది. డబుల్‌ బెడ్‌రూం ఇంటికి 2.5 నుంచి 3 టన్నులు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. ఈ లెక్కన పెరిగిన ధరలతో పోలిస్తే రూ.15 వేలకు పైగా భారం తప్పడం లేదు. గతంలో ఇటుక రూ.6 ఉంటే తాజాగా నాణ్యతను బట్టి రూ.8-10పైమాటే. ఇసుక బ్లాక్‌లో కొంటే టిప్పర్‌కు రూ.30 వేలకు పైగా పలుకుతుంది. పెట్రో ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగాయంటున్నారు. భవన నిర్మాణాలకు కావాల్సిన చెక్క సామాగ్రి, ఎలక్ట్రికల్‌, పెయింట్స్‌ (రంగులు), టైల్స్‌, గ్రానైట్‌ బండలు.. ఇలా అన్ని రకాల సామాగ్రి ధరలు పెరిగాయని బిల్డర్లు అంటున్నారు.
సిమెంట్‌ బస్తాపై రూ.70 పెంపు
ప్రముఖ బ్రాండెడ్‌ సిమెంట్‌ కంపెనీలు రెండు మూడు రోజులకు ఒకసారి ధరలు పెంచుతున్నాయి. కంపెనీల సేల్స్‌ మేనేజర్లు ధరలు పెరుగుతున్నట్లు నాలుగైదు రోజు ముందే మెసేజ్‌ పెట్టి.. ఆరోజు ధరలకే డిడిలు తీయమంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ధర పెరుగుతుందని వడ్డీలకు అప్పులు చేసి డీలర్లు ఆర్డర్లు బుక్‌ చేస్తున్నట్టు ఒక వ్యాపారి తెలిపారు. ఈ వారం రోజుల్లో ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలు మూడుసార్లు ధర పెంచారు. ఈ లెక్కన బస్తాపై రూ.70 వరకు పెరిగింది. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టుకోవాలంటే 950 బస్తాలకు పైగా సిమెంట్‌ అవసరమని ఓ బిల్డర్‌ తెలిపారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటే వెయ్యి బస్తాలకు పైగా అవసరం. ఈ లెక్కన కొత్త ఇల్లు కట్టుకునేవారికి వారం రోజుల్లోనే రూ.65 వేల నుంచి రూ.70 వేలు సిమెంట్‌ రూపంలో అదనపు భారం తప్పడం లేదు.