Feb 28,2023 23:28

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి

ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ గ్రామాల ప్రజలు
ప్రజాశక్తి - బిక్కవోలు
కాలుష్య కారకమైన గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌ విస్తరణకు అనుమతులు ఇవ్వొద్దని పలువురు ప్రజాభిప్రాయ సేకరణలో విజ్ఞప్తి చేశారు. మంగళవారం బలభద్రపురంలోని హైస్కూల్‌లో గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం సభను నిర్వహించారు. గత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భారీగా మొహరించారు. ఎంఎల్‌ఎ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఫ్యాక్టరీ కోసం అప్పటి కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా స్థానిక ప్రజలు చెప్పులతో దాడి చేయడంతో సుమారు 500 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన సభకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. గ్రాసిమ్‌ సంస్థ సంవత్సరానికి 30 వేల టన్నుల బొగ్గును మండిస్తూ కాలుష్యానికి కారణం అవుతుందన్నారు. 70 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని గ్రాసిమ్‌ ఇండిస్టీ యాజమాన్యం మాట ఇచ్చి తప్పిందన్నారు. స్థానికంగా కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌ విస్తరణకు అనుమతులు జారీ చేయొద్దని కలెక్టర్‌ మాధవీలతను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు తెలిపిన అభ్యంతరాలను, సలహాలను రాష్ట్ర, కేంద్ర కాలుష్య నివారణ సంస్థకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు బారీ గా తరలి వచ్చారు.