Jun 02,2023 23:02

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న విమర్శలపై ఎంపీ మార్గాని భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భరత్‌ మాట్లాడారు. తాను గోరంట్లకు శిష్యుడంటున్నారు, ఇదెక్కడి సంబంధమో తనకు తెలీదన్నారు. మోరంపూడి ఫ్లరు ఓవర్‌తో పాటు మిగిలిన ఐదు ఎఫ్‌ఒబిలు శాంక్షన్‌ చేయించినట్టు ఎంఎల్‌శ్రీ గోరంట్ల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వీటిని ఎంఎల్‌ఎ గోరంట్ల శాంక్షన్‌ చేయించినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడి లోకువ కావొద్దని హితవు పలికారు. మోరంపూడి బ్రిడ్జిని డిసెంబరు నాటికి పూర్తి చేసి జాతికి అంకిత మిస్తామని ఎంపీ తెలిపారు. అన్నపూర్ణమ్మ పేటలో ఆర్‌ఒబి, మధురపూడి ఎయిర్‌ పోర్ట్‌లో రూ.400 కోట్లతో టెర్మినల్‌, రైల్వే స్టేషను రహదారి వెడల్పు, సెంట్రల్‌ డివైడింగ్‌ పనులన్నీ చేసి తీరతానన్నారు.
ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నగరానికి గర్వకారణం
ప్రభుత్వ మెడికల్‌ కళాశాల రాజమహేంద్రవరం నగరానికి మరో ఆణిముత్యమని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో 16 మెడికల్‌ కళాశాలలు మంజూరు చేశారన్నారు. ఈ ఏడాది నుంచే కళాశాల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నర్సింగ్‌ బ్లాక్‌లో తరగతులు ప్రారంభమైనా, వచ్చే విద్యా సంవత్సరం సొంత క్యాంపస్‌లో తరగతులు కొనసాగుతాయని చెప్పారు.
2015లో వచ్చిన పుష్కరాలకు అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసిన రూ.2 వేల కోట్లను టిడిపి నేతలు గోదావరి పాల్జేశారన్నారు. గోడలకు రంగులు తప్ప ఏమీ చేయలేదన్నారు. సిఎం జగన్‌ రాజమండ్రిపై ప్రత్యేక అభిమానంతో రూ.125 కోట్లు ప్రత్యేక గ్రాంటు శాంక్షన్‌ చేశారన్నారు. వాటితో, అభివద్ధి పనులు శరవేగంతో పరుగులు పెడుతున్నాయన్నారు. ప్రశాంతతకు మారు పేరైన నగరంలోకి అసాంఘిక శక్తులు చొచ్చుకు రావడం దురదృష్టకరమన్నారు. కొంత మంది చదువురాని దద్దమ్మలు నాయకులుగా చెలామణీ అవుతూ బ్లేడ్‌ బ్యాచ్‌, రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వారి వల్లనే నగరంలో ప్రశాంతత దెబ్బతింటోందన్నారు.