May 03,2023 23:14

తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి జవహర్‌ తదితరులు

గోపాలపురంలో రైతుగళం పాదయాత్ర
ప్రజాశక్తి - గోపాలపురం
టిడిపి ఆధ్వర్యంలో రైతు గళం - రైతుల కోసం తెలుగుదేశం పోరాటం పేర చెరుకుమిల్లి నుంచి గోపాలపురం వరకు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జవహర్‌, టిడిపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా పశుగణాభివద్ధి శాఖ చైర్మన్‌ పాకలపాటి గాంధీ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు. వర్షాలకు తడిచిన పంటలను కళ్లాల వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్లే నేడు రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. గోనె సంచులను నేటికీ ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రైతులను పట్టించుకోకుండా బాబాయిని హత్య చేసిన హంతుకులను ఎలా కాపాడాలనేదానిపై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. నష్టపోయిన రైతులను కనీసం ఓదార్చేందుకు కూడా ఎంఎల్‌ఎలు, మంత్రులు వెళ్లలేదన్నారు.రైతన్నలకు అండగా నిలిచి భరోసా ఇచ్చిన ప్రభుత్వం టిడిపి మాత్రమేనన్నారు. పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక, ధాన్యం కొనే నాధుడే కరువయ్యాడన్నారు. మండలంలో రైతన్నల ఆవేదనను స్థానిక ఎంఎల్‌ఎ పట్టించుకోవట్లేదన్నారు. ఈ ప్రభుత్వంలో 1,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేలాని, లేకుంటే నిరవదిక దీక్షకు దిగుతామని మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందిం చారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.