ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి కల్యాణమస్తు పథకం అమలుకు ఎట్టకేలకు రంగం సిద్ధమయ్యింది. జిల్లాలో కేవలం 156 మందికి మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించనుంది. 'పెళ్లికానుక' పేరుతో గతంలో అమలైన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ తర్వాత కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పేర్లతో తిరిగి అమలు చేస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ, డిఆర్‌డిఎ వద్ద వేలసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే ఈ పథకం కింద లబ్ధి అతి కొద్దిమందికే పరిమితమవుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే రూ1.20 లక్షలు, బిసిలకు రూ.50 వేలు, బిసిలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75,000, వికలాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.50 వేలు చొప్పున ఈ పథకం ద్వారా నగదు అందజేయనున్నారు. ఈ పథకం అమల్లో పేరు గొప్ప ఊరు దిబ్బలా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనలతో పేదింటి ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వ సాయం దూరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పదో తరగతి విద్య పేరుతో విద్యార్హత మెలిక
కల్యాణమస్తు కింద ఆర్థిక సాయం అందాలంటే వధువు, వరుడు ఇద్దరూ ఖచ్చితంగా పదో తరగతి చదివి ఉండాల్సిందే అనే నిబంధన పెట్టారు. పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉన్నా పల్లెటూళ్లలో అధిక శాతం మంది ఆడపిల్లల్ని అయితే ఏడో తరగతిలోపే చదువు మాన్పించి వేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో గడచిన మూడేళ్లలో పల్లెలో అనేక డ్రాపౌట్స్ పెరిగాయి. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పేద కుటుంబాలు వివాహాలు జరిపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2019-2020 సంవత్సరాల్లో అత్యధిక మంది వివాహనాలు జరిగాయి. వీరిలో పదో తరగతి వరకు చదవని వారు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నప్పటికీ విద్యార్హత కారణంగా వధువు, వరుడు ఇద్దరూ చదివి ఉండాలనే నిబంధన చాలామంది అర్హులకు ఇబ్బందిగా మారింది.
విద్యుత్ వినియోగం సాకుతో వడపోత
విద్యుత్ వినియోగం సాకుగా చూపించి అనర్హత వేటు పడింది. కల్యాణమస్తు, షాదీతోఫాల పథకాలకు గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకుంటే అనర్హులంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తోడు ఇంట్లో ఎవరి పేరుతో అయినా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా అనర్హులే అంటూ మార్గదర్శకాలును విడుదల చేసింది. పట్టణాల్లో అయితే నెలకు రూ.12 వేలు, పల్లెటూళ్లలో అయితే రూ.10 వేలు ఆదాయం ఉంటే వారు కూడా అ నర్హులే. మూడెకరాలు మాగాణి, లేదా 10 ఎకరాల మెట్టభూమి ఉంటే వీరికి పథకం అందదు. ఇక పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే వీరు కూడా అనర్హులే. గతంతో పోల్చితే సాయం మొత్తం అధికమే అయినా లబ్ధి పొందే వారి సంఖ్యల గతం కంటే గణనీయంగా తగ్గేపోయే అవకాశం ఉంది. దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే వారి పరిస్థితి దయనీయంగా మారింది. తాజా నిబంధనలు అడ్డుగోడలుగా మారి అర్హులకు దూరం చేశాయి.
ఎట్టకేలకు పథకం అమలు
ఈ నెల పదో తేదీన ఈ పథకం తొలి విడత ప్రయోజనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేయనున్నారు. గతంలో పెళ్లికానుక పథకం కొంతకాలం సాంఘిక సంక్షేమశాఖ ద్వారా చివరల్లో డిఆర్‌డిఎ ద్వారా అమలు జరిగింది. అయితే ప్రస్తుతం మారిన మార్గదర్శకాల ప్రకారం వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని ఈ రెండు నుంచి కాకుండా నేరుగా సచివాలయాల ద్వారానే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. గత మూడేళ్లుగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు చెందిన పలు పథకాలను ఎక్కువగా ఆపడం తెలిసిందే. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా ఒకొక్క పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తోంది. అంబేడ్కర్ విదేశీవిద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచిత సీట్లు (బిఎఎస్) వంటివి ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఈ మూడేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు జగనన్న పేరుతో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.










