ప్రజాశక్తి-నల్లజర్ల
పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ దూబచర్ల విఆర్‌ఒ పి.సూరిబాబు ఎసిబి అధికారులకు చిక్కారు. ఎసిబి ఎఎస్‌పి సిహెచ్.సౌజన్య ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయ్యవరం గ్రామానికి చెందిన రైతు అల్లే రాంబాబుకు 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి పట్టాదారు పాస్ పుస్తకం నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌బుక్ మంజూరు కోసం విఆర్‌ఒ రూ.25వేలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని కొద్ది రోజుల క్రితం రూ.10 వేల రూపాయలు ఇచ్చి పని పూర్తి చేయమని కోరాడు. అయినప్పటికీ మిగిలిన రూ.15వేలు ఇస్తే తప్ప పని జరగదని విఆర్‌ఒ స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపన్ని విఆర్‌ఒను పట్టుకున్నారు. విఆర్‌ఒను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎఎస్‌పి సౌజన్య తెలిపారు. ఈ దాడిలో సిఐ వాసు కృష్ణ, శ్రీనివాస్, ఎస్‌ఐ విల్సన్ పాల్గొన్నారు.










