ప్రజాశక్తి-కోరుకొండ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్‌ను సోమవారం కోరుకొండలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రాజులోవ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను విదేశీ స్వదేశీ సంస్థలకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు భారత వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసిందని, వాటికి వ్యతిరేకంగా దేశంలో రైతాంగం ఏడాదిపాటు ఢిల్లీని దిగ్బంధించిందని అన్నారు. మోదీ పాలనలో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










