ప్రజాశక్తి - గోపాలపురం
ఎన్‌టిఆర్ గురించి మాట్లాడే అర్హత టిడిపి నాయకులకు లేదని కొడాలి నాని, మరికొంత మంది వైసిపి నాయకులు అంటున్నారని, వారికి ఏమాత్రం సిగ్గున్నా ఎన్‌టిఆర్ పేరున ఉన్న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని జడ్‌పి మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు అన్నారు. శుక్రవారం గోపాలపురంలో జేష్ట బుల్లిఅబ్బులు ఆర్థిక సాయం పేదలకు, వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాపిరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్‌టిఆర్ గురించి మాట్లాడే అర్హత టిడిపి వారికి లేదనడం సరికాదన్నారు. ఎన్‌టిఆర్ పేరున టిడిపి హయాంలో అన్నా క్యాంటీర్ల ద్వారా పేదలకు రూ.5కే భోజనం అందించారన్నారు. అటువంటి వాటిని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గుడివాడలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన బొమ్మతో ఓట్లు దండుకోవడం కాదని రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌టిఆర్ పేరున ఉన్న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారని డిమాండ్ చేశారు. వైసిపి పేదల నోటివద్ద కూడును దూరం చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిసిలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు కల్పించిన మహానుభావుడు ఎన్‌టిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










