Mar 26,2023 23:10

అడహక్‌ కమిటీతో నాయకులు రాజులోవ, శ్రీనివాస్‌ తదితరులు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా సమావేశంలో నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక పేపర్‌ మిల్లు వద్ద గల బిటిఆర్‌ భవన్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు పలివెల శ్రీనివాస్‌ మాట్లాడారు. ఎన్‌హెచ్‌ఎం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. వీరికి కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన వారికి ఇచ్చే వేతనాలు అంతంత మాత్రమే అన్నారు. సెలవులు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటివి అమలవ్వటేలదని తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జెఎసి చైర్మన్‌ దయామణి మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సమస్యలు పరిష్కారం కోసం ఐక్యంగా ఉండాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసిందన్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించగలిగిందని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్‌, ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైద్య రంగానికి తగినన్ని కేటాయింపులు చేయలేదన్నారు. వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలని, ఆ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం, సమాన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ స్థానాల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సతీష్‌, రాజశేఖర్‌, వెంకటలక్ష్మి, నవీన్‌ కుమార్‌, మంగాదేవి, దేవిలను ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జిల్లా అడహక్‌ కమిటీగా ఎన్నుకున్నారు.