May 18,2023 22:46

ఎన్‌ఐసితో అయోమయం

పారదర్శకత కోసం తెచ్చిన సాఫ్ట్‌వేర్‌తో తప్పని చిక్కులు
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఉపాధికి తూట్లు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఉపాధి హామీ చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఐసితో అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాదిలో 100 రోజుల పాటు ప్రతి నిరుపేద కుటుంబానికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు చేసిన పోరాట ఫలితంగా యుపిఎ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి నిధుల కేటాయింపును క్రమంగా తగ్గించింది. దీంతో పాటూ పారదర్శకత పేరుతో అమల్లోకి తెచ్చిన ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ కొత్త సమస్యలకు కారణమవుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో కఠినమైన నిబంధనలుండడంతో క్షేత్రస్థాయిలో ఉపాధి చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికే వేసవిలో అందించే సమ్మర్‌ అలవెన్సులకు కొర్రీ వేసింది. రోజుకు రెండు సార్లు మస్తరు విధానం అమల్లోకి తీసుకురావడం, బ్యాంకు ఖాతాలు ఆధునికీకరణ, మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లపై మరింత పనిభారం పరిపాటిగా మారాయి. ముఖ్యంగా రెండుసార్లు మస్తర్లు విధానం అమల్లోకి రావడంతో వేసవిలో సైతం ఉపాధి కూలీలు పని ప్రదేశాలలో 4 నుంచి 6 గంటల పాటు వేచి చూడాల్సిన దుస్థితి తలెత్తుతోంది.
మేట్ల సంఖ్య కుదింపుతో ఇబ్బందులు
గతంలో ఉపాధి హామీ పథకంలో తాత్కాలికంగా పదిమందికి పైగా ఉన్న ఒక గ్రూపునకు, శాశ్వతంగా 25 మందికిపైగా ఉన్న గ్రూపునకు ఒక మేటు ఉండేవారు. వీరి ద్వారానే ఉపాధి పనులను కూలీలకు చేరేవి. ఈ మేటు క్షేత్రస్థాయిలో కూలీలు చేయాల్సిన పనుల కొలతను సూచిస్తూ రోజువారీగా కూలీల హాజరు వివరాలను నమోదు చేస్తూ ఉండేవారు. ఇలా ఒక్కో గ్రామంలో సుమారు 20 నుంచి 80 మంది వరకు మేట్లు పనులను పర్యవేక్షించేవారు. ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో ఒకొక్క మేటు మూడు నుంచి ఐదు గ్రూపులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను రోజుకు రెండు సార్లు ఆన్‌లైన్‌లో(ఎన్‌ఎంఎంఎస్‌) అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల తర్వాత మస్తర్లు వేస్తున్నారు. ఎండలు మండుతున్న ఈ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పనులు చేయాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు ఎండలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్న ప్రభుత్వాలు ఈ ఎన్‌ఐసి ద్వారా హాజరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన పెట్టడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల ఎండలో 12 గంటల వరకూ ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌తో కొత్త చిక్కులు
ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పేరుతో గతేడాది కొత్త సాఫ్ట్‌వేర్‌ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సాఫ్ట్‌ వేర్‌ కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయనే అభిప్రాయం కూలీలలోనూ, సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. గతంలో ఉపాధిహామి పథకంలో ఒక గ్రూపు పనికి వెళ్లాలంటే సంబంధిత గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌ ద్వారా పని కోసం డిమాండ్‌ దరఖాస్తును చేసేవారు. కాని ఇప్పుడు ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మండల కంప్యూటర్‌ సెంటర్‌ నుంచి (ఎంసీసీ) మాత్రమే పని కోసం డిమాండ్‌ దరఖాస్తును చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి డిమాండ్‌ ఆ తర్వాత పని కేటాయింపు, ఆ తర్వాత మస్టరు జనరేట్‌ చేయడం లాంటి పనులు ఎంసీసీ ద్వారానే నిర్వహించాల్సి వస్తోందని కంప్యూటర్‌ ఆపరేటర్‌లు వాపోతున్నారు. పైగా గతంలో ఒక గ్రామ పంచాయతికి సంబంధించి ఒకేక్లిక్‌తో మస్టరు జనరేట్‌ ఆయ్యేవని ఇప్పుడు మాత్రం ప్రతిగ్రూపు గ్రూపుకు మస్టరు జనరేట్‌ చేయాల్సిన పరిస్తితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు, పోస్టల్‌ఖాతాలను ఆధునీకరించి అకౌంట్‌లు జనరేట్‌ చేశామని చెబుతున్నారు. ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సిబ్బందిపై తప్పని పనిభారం
జిల్లాలో 1.89 లక్షల జాబ్‌కార్డులుండగా 2.96 లక్షల మంది ఉపాధి హామీ కూలీలున్నారు. ఇందులో 1.23 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌లో ఉండగా 1.8 లక్షల మంది కూలీలు పనులకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 30 నుంచి 80 వరకు ఉపాధి హామీ గ్రూపులున్నాయి. కంప్యూటర్‌ ఆపరేటర్లు మాత్రం మండలానికి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ప్రతి రోజూ పని డిమాండ్‌, పని కేటాయింపు, మస్తరు జనరేట్‌, పేమెంట్స్‌ చేయడంలో వీరికి కీలక పాత్ర. సిబ్బంది కొరత కారణంగా రాత్రి వేళల్లోనూ పనిచేయాల్సిన పరిస్థితి. మరోపక్క గ్రామాల్లో పనులను పర్యవేక్షించి కొలతలను స్వీకరించాల్సిన టెక్నికల్‌ అసిస్టెంట్లు కూడా తక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికి పది గ్రామాలకు ఇన్‌ఛార్జిలుగా అదనపు భారం పడుతోంది. కొత్త సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేలా లేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మస్తర్లు వేసేందుకు ఇబ్బందులు
ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌తో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నెల 17న మస్తర్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ సమస్య ఉందని అధికారులు తెలిపారు. కొన్ని సార్లు ఏ గ్రూపులో పేరు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఒక్కరే మేటు రెండు లేక మూడు గ్రూపులను పరిశీలించి ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో పని భారం పెరిగింది. పాతపద్దతిలో మస్తర్లు వేయాలి, లేదా సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు కల్పించాలి.
- అంబటి రమణ. ఫీల్డ్‌ అసిస్టెంట్‌
మస్తర్ల కోసం ఎండలోనే పడిగాపులు
గ్రామంలో చెరువు పూడిక తీత పనులు 2 వారాల నుంచి చేస్తున్నాం. పూడిక మస్తరు కోసం రెండుసార్లు ఫోటో అప్‌లోడ్‌ చేయాలంటే పని ప్రదేశంలో ఎండలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నతాధికారులు చొరవ చూపించాలి. పాత పద్దతిలో మస్తర్ల విధానం అమల్లోకి తీసుకురావాలి.
- జి.లక్షణరావు, ఉపాధి కూలీ, పిట్టల వేమవరం