ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు రూరల్, దేవరపల్లి
జిల్లాలో ఎన్‌ఐఎ దాడు లతో జిల్లా ప్రజలు కలవరం చెందారు. రాజమహేంద్ర వరం రూరల్, రాజమ హేంద్రవరం, కొవ్వూరుల్లో సోమవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులో కుల నిర్మూలన సమితి జిల్లా అధ్యక్షులు కోనాల లాజ రస్, రాజమహేం ద్రవరంలో చైతన్య మహిళా సంఘం నాయకులు జి.రమ, కొవ్వూరులో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది నంబూరి శ్రీమన్నా రాయణ ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగిగా లాజరస్ ఉన్నారు. సోదాల సమయంలో ఆయన విధుల్లో ఉండటంతో ఎన్‌ఐఎ అధికారులు ఫోన్ చేసి ఇంటికి రప్పించారు. ఆయన సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 19న హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరంలో చైతన్య మహిళా సంఘం నాయకులు జి.రమ అందుబాటులో లేకపోవడంతో సోదాలు జరిపి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరులో న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఇంట్లో అణువణువునూ అధికారులు సోదా చేశారు. ఆయన మొబైల్‌ను సీజ్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ముంచింగుపుట్టు కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కేసులో నిందితుల తరుపున శ్రీమన్నారాయణ వాదిస్తున్నారు. సోదాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయిన ప్పటికీ ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేశారు. రైడింగ్ సమయంలో డివైసెస్ సీజ్ చేయకూడదని కోర్టు తీర్పులు చెబుతున్నాయని శ్రీమన్నారాయణ తెలిపినా ఎన్‌ఐఎ అధికారులు వినిపించుకోలేదు. ఎన్‌ఐఎ తీరుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఆయనకు సిఆర్‌పిసి 160 ప్రకారం నోటీసులు అందించారు. ఈనెల 24న హైదరాబాదులోని ఎన్‌ఐఎ కార్యాలయంలో హాజరుకావాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల నేతల ఇళ్ళపై ఎన్‌ఐఎ దాడులు అప్రజా స్వామికమని ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ అన్నారు. ప్రజాస్వామిక వాదుల ఇళ్లపై దాడులు చేసిన ఎన్‌ఐఎ అధికారులు నోటీసులు ఇచ్చి హైదరబాద్ రావాలిన చెప్పారని, ఈ ఆదేశాలు ప్రజల హక్కులను హరించడమేనని అన్నారు.










