Mar 09,2023 23:00

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఈ నెల 13న జరగనున్న రెండు స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకె.మీనా వెలగపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాధవీలత మాట్లాడారు. కొవ్వూరు డివిజన్‌ పరిధిలో 242 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. ఓటు హక్కు వినియోగించు కోవడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థలకు చెందిన కొవ్వూరు మునిసిపాలిటీలో 23 మంది, నిడదవోలు పురపాలక సంఘం పరిధిలో 28 మంది, 9 మంది జెడ్‌పిటిసిలు, 179 మంది ఎంపిటిసిలు, ముగ్గురు ఎంఎల్‌ఎలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఎన్నికల పక్రియకు సంబందించి పిఒలు, ఎపిఒలు, ఒపిఒలు, 9 ఎంసిసి బృందాలు, 9 ఎఫ్‌ఎస్‌టి బృందాలను నియమించామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఒ జి.నరసింహులు, ఎలక్షన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజ్యలక్ష్మి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.