Jun 05,2023 15:16

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : గాలికి తెగిపోయిన విద్యుత్ వైర్లు, కూలిపోయిన స్తంభాల ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, రాగల 48 గంటలలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయగలమని ఉండ్రాజవరం ఎలక్ట్రికల్ ఏఈ ఎన్ దొరబాబు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా వీచిన భారీ గాలులకు, చెట్లు తెగిపడి, విద్యుత్ వైర్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీని కారణంగా మండలంలో గత 24 గంటలుగా విద్యుత్ కోత ఏర్పడింది. గ్రామాలు అంధకారమయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ, మండల కేంద్రంలో ఇంకా పనులు నిర్వహించాల్సి ఉందన్నారు.  విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ ఈ, డిఈ, ఏడిఈల తక్షణ సలహా, సహకారాలతో రాత్రి, పగలు చూడకుండా, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, పనులు శర వేగంగా నిర్వహిస్తున్నట్లు ఏ ఈ తెలిపారు. ఉండ్రాజవరంలో సిబ్బంది నిర్వహిస్తున్న పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు కొంత సంయమనం పాటించాలని, గ్రామస్థాయి నాయకులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.