ఎల్‌ఐసి జాతీయ మహాసభ జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి - ఉండ్రాజవరం
ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఎల్‌ఐసిని ప్రయివేటు పరం చేసే దిశగా సాగుతున్న చర్యలను అడ్డుకోవాలని ఎల్‌ఐసి ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని పాలంగిలో నిర్వహించిన ఎల్‌ఐసి ఎఒఐ రాజమండ్రి డివిజన్ ఈసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 22, 23 తేదీల్లో జరగనున్న ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 6వ అఖిలభారత మహాసభను విజయవంతం కోసం ఈ సమావేశం నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఎల్‌ఐసి ఎదుర్కొంటున్న ఐపిఒ, బీమా సుగం ఐఆర్‌డిఎ డ్రాఫ్ట్ లకు వ్యతిరేకంగా ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ఏజెంట్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. లేని పక్షంలో 11 లక్షల మంది ఏజెంట్లు, వారి కుటుంబాలు రోడ్డున పడే ఆస్కారం ఉందన్నారు. ఈ సమస్యలపై మహాసభలో చర్చించి కార్యాచరణ చేపడతారన్నారు. ప్రతి ఒక్కరూ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని తీర్మానించారు. ఈ సమావేశానికి రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు వై.విశ్వేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు టి.కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి.రవికిషోర్, డివిజన్ కార్యదర్శి కె.నాగిరెడ్డి, ట్రెజరర్ రాచూరి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.జాన్‌బాబు, తణుకు శాఖ ఏజెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సత్తి పాండురంగారెడ్డి, ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు సలాది ఉదయభాస్కరరావు, ట్రెజరర్ రామప్రసాద్, బొలిశెట్టి రామనాథ్, చెక్క గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










