ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎంఎల్‌సిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, జెసి ఎస్.ఇలక్కియ ప్రకటించారు. ఎన్నిక నిర్వహణ ప్రక్రియలో 27వ తేదీ సోమవారం మద్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి ఈ ఎన్నికల పోటీలో వైఎసిపి పార్టీ అభ్యర్థిగా కుడుపూడి ఏకైక అభ్యర్థిగా నిలవడంతో ఎంఎల్‌సిగా ఎన్నికైనట్లుగా ప్రకటించి, ఆయనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ అందజేశారు. ఎంఎల్‌సి ఎన్నికైన కుడుపూడి సూర్యనారాయణరావుకు కాకినాడ, రాజమహేంద్రవరం ఎంపిలు వంగా గీత, మార్గాని భరత్ రామ్, కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అభినందనలు తెలిపారు. ఎంఎల్‌సి సూర్యనారాయణరావు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపారు.










