ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 2 లక్షల 62 వేల మందికి టిడ్కో ఇళ్ళ పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం రాజానగరం పరిధిలోని జిఎస్‌ఎల్ సమీపంలోని ఒక సమావేశ మందిరంలో హోమ్ మంత్రి తానేటి వనిత, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండి సిహెచ్.శ్రీధర్‌తో కలిసి పురపాలక మంత్రి సురేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పూరి గుడిసె లేకుండా అర్హులైన పేదలకు సొంతింటి కల సాకారం చేసే దిశలో ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసి టిడ్కో గహాలను అందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత పాలకుల హయాంలో రూ.7 లక్షల ఇళ్లను అందించేందుకు పేదలపై రూ.6 లక్షల ఆర్థిక భారం వేశారన్నారు. జగనన్న ప్రభుత్వం ఆ ఆర్థిక భారం రూ.11 వేల కోట్లు భరించి 1,45,000 వేల మందికి ఒక్క రూపాయితో సొంతింటి కల సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొవ్వూరు, నిడదవోలు, రాజమహేంద్రవరం పట్టణాల పరిధిలోని టిడ్కో గహాలపై సమీక్ష చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2023 చివరి నాటికి 5 వేల టిడ్కో ఇంటి పత్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ కాలనీల్లో పూర్తి స్థాయిలో తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, విద్యుత్, అనుసంధాన రహదారి వంటి సౌకర్యాల కల్పన కలుగజేస్తామన్నారు. ఆ దిశలో అధికారులకు దిశా నిర్ధేశం చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు కాల పరిమితి నిర్ధేశించినట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లను అందించాలని లక్ష్యం కాగా 75 వేల ఇళ్లు అందించినట్టు చెప్పారు. మిగిలిన 25 వేల ఇళ్లు ఈనెలలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కేటగిరీ ఎ పరిధిలోని 240 ఇళ్లను ఒక్క రూపాయితో లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. కేటగిరీ సిలో ఉన్న 240 ఇళ్లకు 165 మందికి బ్యాంకు రుణాలను మంజూరు చేసినట్టు తెలిపారు. మిగిలిన వారికి రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వనిత పేర్కొన్నారు. టిడ్కో గహాలకు సంబంధించి 90 శాతం పై నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్‌పర్సన్ భావన రత్నకుమారి, వైస్ చైర్మన్‌లు మన్నే పద్మావతి, గండ్రోతు అంజలీ దేవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండి సిహెచ్.శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, టిడ్కో ఇంజనీర్లు పి.గోపాలకృష్ణారెడ్డి, బి.శ్రీనివాసరావు, ఎంఎస్.స్వామినాయుడు, జి.నాగేశ్వరి, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.










