Apr 03,2023 23:17

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం దేశ రాజధాని ఢిల్లీలో మజ్దూర్‌ కిసాన్‌ ర్యాలీ, మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లా నుస్త్రఎతీ కార్మికులు, ఉద్యోగులు, రైతులు సోమవారం బయల్దేరి వెళ్లారు. అంగన్‌వాడీ, మధ్యాహ్నం భోజనం వంటి కేంద్ర స్కీముల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పలు పరిశ్రమల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, పర్మినెంట్‌ ఉద్యోగులు, పలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. వీరందరినీ సిఐటిటి జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, బి.రాజులోవ, బి.పూర్ణిమరాజు, బి.పవన్‌, కె.అన్నామణి, ఎం.వెంకటలక్ష్మి పూలమాలలు వేసి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. మోడీ కార్పొరేట్‌ విధానాలు విరమించుకునే వరకు, దేశ సంపదను కార్పొరేట్‌ ప్రైవేట్‌ పరం చేసే విధానం ఆపే వరకు, కార్మికుల కనీస వేతనం అమలు చేసే వరకు,రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేవరకు, అధిక ధరలు తగ్గించే వరకు పోరాడుతూనే ఉంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుసంఘం అంగన్‌వాడీ వర్కర్‌ యూనియన్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.