ఫీజులు తగ్గించాలని కోరినందుకు కక్ష సాధింపు
ఒకే ఏడాది 70 మందికి విద్యార్థులకు టిసిలు
తల్లిదండ్రుల ప్రవర్తన రాలేదని టిసిలపై రాసిన వైనం
ప్రజాశక్తి-నల్లజర్ల
నల్లజర్ల మండలం తెలికి చర్ల గ్రామ శివారున ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇష్టాను సారంగా వ్యవహరిస్తోంది. ఫీజులు తగ్గించాలని కోరినందుకు 70 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చింది. అంతే కాకుండా టిసిలపై విద్యార్థుల తల్లిదండ్రుల ప్రవర్తన బాలేదంటూ రాసి కక్షసాధింపు చర్యలకు దిగింది. తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులపైనే కేసులు పెట్టింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థుల తల్లిదండ్రులు మద్దిపాటి రవితేజ, కోడూరి నిహారిక, తల్లా అనూష తదితరులు తెలిపిన వివరాల ప్రకారం... 2022లో ఈ పాఠశాలను ప్రారంభించారు. ఎల్‌కెజి నుంచి 9వ తరగది వరకూ సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. యాజమాన్యం ఇటీవల మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఫీజులను పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం యుకెజికి ఫీజు రూ.68వేలు కాగా, యుకెజి నుంచి మొదటి తరగతికి వెళ్లాలంటే రూ.96వేలు కట్టాలని యాజమాన్యం తెలిపింది. దీంతో కొంత మంది తల్లిదండ్రులు యాజమాన్యంతో మాట్లాడారు. తాము అంత డబ్బులు కట్టలేమని, రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు వాగ్వాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వైఖరిని కొంత మంది తల్లిదండ్రులు మొబైల్‌లో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం గేట్లను మూయించేసి వారి వద్ద సెల్‌ఫోన్లు లాక్కుని వీడియోలను డిలీట్ చేసి పంపించేసింది. అనంతరం ఈ నెల 25న 70 మంది విద్యార్థులకు టిసిలు ఇచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రవర్తన బాలేని కారణంగా టిసి ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులపై ఈ నెల 27 పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాజమాన్యం ఫిర్యాదుపై విద్యార్థుల తల్లిండ్రులను మంగళవారం ఉదయం 9గంటలకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు కబరు పంపారు. మధ్యాహ్నాం 2 గంటలైనా యాజమాన్యం రాలేదని తెలిపారు. యాజమాన్యం తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయపోరాటానికి దిగుతామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ఎంఇఒను వివరణ కోరాగా ఈ ఘటన గురించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌కు అనుమతులు మండలం నుంచి ఇవ్వలేదని తెలిపారు.










