ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో వ్యవసాయ సహకార సంఘాల ముఖ్య కార్య నిర్వహణ అధికారులు కీలక పాత్ర పోషించాలని జెసి ఎన్ . తేజ్ భరత్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో పిఎసిఎస్‌ల సిఈఒలతో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 ఖరీఫ్ సీజన్‌లో వరి సేకరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ మేరకు ప్యాక్ సొసైటీ సిఈఒల పాత్రపై స్పష్టంగా వివరించారు. ధాన్యం కొనుగోలు సమయంలో పిఎసిఎస్‌ల ద్వారా తమ మద్దతును అందించాలన్నారు. సిఈఒలకు తమ తమ గ్రామాల్లోని రైతుల అవసరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల కొనుగోళ్లను విజయవంతం చేయాలని జెసి కోరారు. ఈ సీజన్‌లో అమలు చేస్తున్న సంస్కరణలను వివరించారు. ప్రతి ఆర్భికేలో ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఒక హెల్పర్‌ను ప్రభుత్వం నియమిస్తున్నట్లుతెలిపారు. ఆ మిల్లుకు కేటాయించిన లక్ష్యం మేరకు మిల్లర్ల నుంచి గన్నీ బ్యాగులను సేకరించి ఆన్‌లైన్ కేటాయింపు ద్వారా రైతులకు సరిపడా సంచులను అందుబాటులో ఉంచుతామన్నారు. వరి రవాణా చేసే ప్రతి వాహనానికి జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమర్చడం జరుగుతుందని, ఆమేరకు రవాణాదారులకు 7 రోజులలో చెల్లింపు చేయబడుతుందని చెప్పారు. రైతుల ఇ-కెవైసితోపాటు కొనుగోళ్లకి ఎఫ్‌టిఓ జెనరేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డిఎం ఎ.కుమార్, డిఎస్‌ఒ పి. విజయ భాస్కర్, డిసిఒ వై. ఉమా మహేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.










