ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ధాన్యం కొనుగోలుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. రైతుల నుంచి బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని కొనుగోలు కేంద్రాలు బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ బయోమెట్రిక్ విధానాన్ని తెర మీదికి తీసుకొచ్చింది.కొనుగోళ్లలో అక్రమాలకు ముక్కుతాడు వేయాలనే ఉద్దేశ్యంతోనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.
రైతులు వేలిముద్ర వేశాకే ధాన్యం తూకం
రైతులు వేలి ముద్ర వేశాకే ధాన్యం తూకం వేయనున్నారు. పతి ఏటా రైతుల పేర్లు చెప్పి దళారులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తలిస్తుండటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులను అడ్డుకట్టవేసేందుకు అంటూ ప్రభుత్వం ఈ బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కొన్నిచోట్ల తూకంలో తేడాలతో అన్నదా తలను మోసం చేస్తు న్నారు. నిబనంధనలకు మించి తరుగు పేరిట తీసుకున్న ధాన్యాన్ని బోగస్ రైతుల పేరిట విక్రయిస్తున్నారు. మిల్లర్లు సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావుండదు. బయోమెట్రిక్ ఆధారిత కొనుగోళ్ల విధానాన్ని తీసుకురావడటమే దీనికి కారణం. రైతు వేలిముద్ర బయోమెట్రిక్ యంత్రంపై వేశాకే తూకం వేస్తారు. రైతు వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయడం ద్వారా చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది.
రైతుల ఆధార్ తప్పనిసరి
ధాన్యం కొనుగోళ్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్న నేపథ్యంలో వరిసాగు చేసిన రైతులు ఆధార్ నవీకరణ చేసుకోవడం ముఖ్యం. ఆధార్ నవీకరణ లేకపోతే వేలిముద్ర సరిపోక ధాన్యం విక్రయాలు చేయడం కష్టంగా మానునున్నది. ఇదే విషయాన్ని అధికారులు రైతులకు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈకెవైసీ పునరుద్ధరణతోపాటు ఆధార్‌కార్డు నవీకరణ కూడా పూర్తి చేసుకుంటే ధాన్యం విక్రయించే సమయంలో సమస్య ఉండదంటున్నారు. ఆధార్ కార్డు లేని వారు వాటిని తప్పకుండా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే ధాన్యం విక్రయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జిపిఎస్
కొనుగోలు కేంద్రాలనుంచి మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ ట్రాకర్‌ను అమర్చనున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల నుంచి వారికి కేటాయించిన మిల్లు వరకు వాహనం సక్రమంగా వెళతున్నదీ.. లేనిదీ తెలుసుకోవచ్చు. మిల్లర్లు సేకరించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా ఉండడం కోసం ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
55 ధాన్యం కేంద్రాలు ప్రారంభం
తొలి విడతగా 55 ధాన్యం కేంద్రాలను ప్రారంబి óస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్‌లో 3, కొవ్వూరులో 14, తాళ్లపూడిలో 14, కడియంలో 7, గోపాలపురంలో 6, సీతానగరంలో 11 కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఎ-గ్రేడ్‌కు రూ.2,203, బి-గ్రేడ్‌కు రూ.2,183 చొప్పున మద్దతు ధర ప్రకటించారు.17 శాతం తేమ వరకూ ఆరబెట్టుకోవాలి. రవాణాకు సంబంధించి, గోనెసంచుల ఛార్జీలు రూ.3.39పై ఒక్కింటికి, క్వింటాకు హమాలి ఛార్జీలు రూ.22 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
- ఎ.మోహన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి










