Apr 26,2023 23:27

ప్రజాశక్తి-గోపాలపురం ధాన్యం కొనుగోలు విషయంలో విసుగు చెందిన ఒక రైతు కోమటికుంట రైస్‌ మిల్లు వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అందతో స్థానికులు ఆయనపై నీరు పోసి కాపాడారు. రైతు భరోసా కేంద్రాల వద్ద తేమ శాతం కావాల్సిన మేరకు ఉన్నా ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు రైతులు బుధవారం తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తొలుత తహశీల్దారు రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. మిల్లు వద్దకు తీసుకువెళ్లిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరించడంతో రైతులు అధిక సంఖ్యలో మిల్లు వద్దకు చేరుకున్నారు. తెచ్చిన ధాన్యాన్ని ఎందుకు దిగుమతి చేసుకోరని ప్రశ్నించారు. ఎంతసేపటికీ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు అక్కడున్న ప్రత్యేకాధికారి సత్య గోవింద్‌, ఎంపిడిఒ ఆర్‌.శ్రీదేవి, ఎఒ రాజారావును నిలదీశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు చేసేది లేక కొంత ధాన్యాన్ని కోమటికుంట రహదారిపై పోసి నిప్పంటించారు. ఒక రైతు సత్యనారాయణ ఒంటిపై పెట్రోల్‌ పోసుకోగా ఆయనను పలువురు అడ్డుకున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌కు ప్రత్యేకాధికారి ఫోన్‌ చేశారు. జెసి ఆదేశానుసారం అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని దగ్గరుండి దిగుమతి చేయించారు. దీంతో వివాదం సద్దు మణిగింది.