ప్రజాశక్తి-గోపాలపురం : ఉద్యోగుల జీతాలు ఒకటవ తేదీన వచ్చే విధంగా చట్టం అమలు చేయాలని గోపాలపురం తాలూకా జేఏసీ చైర్మన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జోడాల వెంకటేశ్వరరావు కోరారు. బుధవారం జోడాల వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ 8వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా 20 శాఖలలో జీతాలు రాక ఈఎంఐలు కట్టలేక, రెంట్ లు, పిల్లల ఫీజులు, సామాన్య ఖర్చులు చెల్లించుకోలేని పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ప్రతీ నెలా 5 వ తేదీ కి వచ్చే జీతం ఈ నెల ఇంకా రాలేక పోవడం వలన ఉపాధ్యాయ, ఉద్యోగుల బ్యాంకులలో చెక్ లు బౌన్స్ అవ్వడం బ్యాంకులకు అప్పుల పాలు అవ్వడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వారు వెంటనే దీని పై సత్వర చర్యలు చేపట్టాలి అని, జీతాలు 1వ తేదీనే ఇచ్చే చట్టం అమలు చేయాలి అని అన్నారు. ఇప్పటికి యాప్ ల కష్టాలు,హాజరు కష్టాలు, అన్నీ ఒకే సారి ఉపాధ్యాయ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని సిపియస్ ను చేసి, సమయానికి అందించే కరువు భత్యాలు అందించి ఉద్యోగుల ప్రభుత్వం అని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.రావాలి జగన్ కావాలి జగన్ అని మేము కూడా వారికి అండగా ఉన్నాము. కానీ ప్రభుత్వ ఉద్యోగుల కళ్ళలో నిరాశ, నిస్పృహలతో నిండి పోయాయి అని అన్నారు. తక్షణమే అన్ని సమస్యలను పరిష్కరించాలి అని జోడాల కోరారు.










