Mar 27,2023 22:38

ప్రజాశక్తి-గోపాలపురం మహిళ సాధికారతే లక్ష్యంగా డ్వాక్రా మహిళలకు, అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. సోమవారం గోపాలపురం మార్కెట్‌ యార్డ్‌లో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ గోపాలపురం మండలంలో 1,267 డ్వాక్రా గ్రూపులకు రూ.10 కోట్ల 7 లక్షల 85 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ప్రభుత్వపరంగా అండదండలు ఉంటాయని తెలిపారు. లబ్ధి పొందిన డబ్బులతో మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. ఇళ్ల స్థలాలు లేనివారు ఎవరైనా ఉంటే 90 రోజులు కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సుభాషిణి, ఎఎంసి చైర్మన్‌ గన్నమని జనార్దన్‌, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, ఈళ్ల భాస్కర్‌ రావు, జడ్పిటిసి కె.లలిత, వెలగా శ్రీరామమూర్తి, మండల సమాఖ్య అధ్యక్షురాలు వింత శ్రావణి, ఎపిఎం సజన, సర్పంచులు పైడి శిరీష, కురుకూరి ధనలక్ష్మి, అన్నెపు వెంకటలక్ష్మి, అన్వర్‌ బాషా, దండియా, బొమ్మిన నాగరాజు, పోతిరెడ్డి నాగరాజు, ఎస్‌కె.ఖాదర్‌ వలీ, ఎంపిడిఒ ఆర్‌.శ్రీదేవి, ముళ్లపూడి వివేక్‌, ఈర్పిన సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.