Feb 22,2023 23:43

దిగుబడి లేక ధర రాక ఇబ్బందులు
నష్టాల్లో కూరుకు పోతున్నవైనం
మద్ధతు ధర రూ.2వేలు చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి - గోకవరం
దిగుబడి రాక.. ధర లేక దుంప రైతు దిగాలు చెందుతున్నాడు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. పంట సాగుకోసం పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోతుందా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
గోకవరం మండలంలో ఏజెన్సీకి అనుకుని ఉన్న మల్లవరం, చుట్టుపక్కల గ్రామాల రైతులు దుంప సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో ఈ ఏడాది రైతులు దుంప సాగు చేపట్టారు. ఎకరాకు రూ.30వేల వరకూ పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది వర్షాల కారణంగా దుంప తోటలు ఊటెక్కిపోయి దుంపలు కుళ్లిపోయాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా 15 నుంచి 20బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దుంపను కమీషన్‌ పద్ధతిపై దళారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మద్దతు ధర 70 కేజీల బస్తాకు రూ.1,500 నిర్ణయించారు. అమ్మినా రూ.20 వేలు కూడా దక్కడం లేదు. పంటకు లాభం రాకపోగా రూ.20 వేల వరకు నష్టం వస్తుంది. మద్దతు ధర రూ.2వేలు చేస్తే కనీసం పెట్టుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు.
దళారుల దోపిడీ
దుంప ముక్కను కొనుగోలు చేసుకునేందుకు గతంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వ్యాపారులు నేరుగా వచ్చేవారు. దీని వల్ల దుంప రైతులకు లాభాలు ఎలా ఉన్నా నష్టాలు మాత్రం వచ్చేవి కావు. ప్రస్తుతం దళారులు ప్రవేశించడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. గ్రామంలోనే కమీషన్‌ దారులు దళారులుగా ఏర్పడి వ్యాపారులను రాకుండా అడ్డుకుంటున్నారు. దళారులే ధరను నిర్ణయిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముకుని లాభాలు గడిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దళారులను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్దతు ధర పెంచాలి
ఇతర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది. దుంప రైతులకు మాత్రం ఎప్పుడూ మద్దతు ధర పెంచలేదు. సాగో ఫ్యాక్టరీ వారు కూడా రైతుల శ్రమను దోచుకుంటున్నారు. పంట చేతికి వచ్చే సరికి రూ.30వేలనుంచి రూ.40వేల వరకూ ఖర్చు అవుతుంది. దుంప సాగు నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఇటువంటి రైతులను ఆదుకోవాలి.
- దేవర రాజబ్బాయి, దుంప కూలీ మల్లవరం
వర్షాలు నట్టేట ముంచాయి
ఈ ఏడాది వర్షాలు నట్టేట ముంచాయి. ఎక్కువగా కురవడం వల్ల దుంప ఊటదేరి పంట చాలా వరకూ కుళ్లిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి రావాల్సింది సగం రాలేదు. ఈ ఏడాది తీవ్ర నష్టాలు చోటుచేసుకున్నాయి.
- వెలుగుల సింగారమ్మ, దుంప రైతు మల్లవరం
ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టా...
ఈ ఏడాది దుంప దిగుబడిన లేదు. ధర కూడా లేదు. నేను 4.50 ఎకరాల్లో దుంప సాగు చేపట్టాను. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు రూ.20వేలు కూడా రావట్లేదు. మద్దతు ధర రూ.2వేలు ఇప్పించాలి.
- అప్పారావు, దుంప రైతు మల్లవరం.