Feb 28,2023 23:30

సమావేశంలో పాల్గొన్న పూర్ణిమారాజు తదితరులు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
దర్జీలను కార్మికులుగా గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఇన్నీస్‌పేటలోని లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలియం హో జయంతి సందర్భంగా టైలర్స్‌ డేను నిర్వహించారు సంఘం అధ్యక్షులు తాడిచర్ల ప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు భట్లంక నాగప్రకాష్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ నిరుపేద మధ్యతరగతి కుటుంబాల వారు స్వయం ఉపాధిగా దర్జీ వత్తిని ఎంచుకొని జీవిస్తున్నారన్నారు. వీరిలో 75 శాతం వరకూ ఆర్థికంగా వెనుకబడినవారేనన్నారు. వీరందర్నీ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి సంక్షేమ బోర్డ్‌ ఏర్పాటు చేయాలన్నారు. దర్జీలకు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉచితంగా పక్కా గృహాలను ఏర్పాటు చేయాలని, దర్జీలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని, 50 ఏళ్ల దాటిని వారికి పింఛను సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రమాద బీమా, ఇఎస్‌ఐ సౌకర్యాలు అందించాలన్నారు. వీటి సాధనకు టైలర్లు ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి గుదే కోటేశ్వరరావు, కోశాధికారి మహేష్‌, సంఘం సభ్యులు సిహెచ్‌.నాగమణి, ఎం.అరుణ, ఆర్‌.రవణమ్మ, టి.త్రినాథరావు, సిహెచ్‌.నాయుడు, బి.శ్రీనివాసరావు, టి.బాబ్జి, ఉదరు రాజు తదితరులు పాల్గొన్నారు.