హోం మంత్రికి దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక వినతి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
గోకవరం మండలం తిరుమలాయపాలెంలో దళితులపై పోలీసులు, పెత్తందార్ల దాడిపై సమగ్ర విచారణ చేసి నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని తిరుమలాయపాలెం దళిత పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరానికి వచ్చిన హోం మంత్రి డాక్టర్ తానేటి వనితకు దళిత, గిరిజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు వినతిపత్రాన్ని అందించారు. తిరుమలాయపాలెంలో నేటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్నారు. దళితులను ఇప్పటికే అక్కడ ఉన్న అగ్రవర్ణ పెద్ద మనుషులు సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. వారికి ఎలాంటి ఆహార పదార్థాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందకుండా కట్టడి చేశారని తెలిపారు. గ్రామంలో సెక్షన్ 30, 144 పేరుతో ఎవరినీ కలవకుండా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. బాధితులకు నిత్యావసరాలు అందించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని, పోరాట కమిటీ ప్రతినిధులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎస్‌సి కమిషన్ చైర్మన్ విక్టర్‌ప్రసాద్ ప్రత్యక్షంగా హాజరైతే గాని బాధితులకు సరుకులు అందించలేకపోయామన్నారు. బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. బాధితులు పెట్టిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ దమనకాండకు కారకులైన పెత్తందారులు, పోలీసు శాఖకు చెందిన ఎస్‌ఐ, సిఐ, డిఎస్‌పి, రెవెన్యూ సిబ్బందిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని, గ్రామ బహిష్కరణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులపైనా, బాధితులకు అండగా నిలిచిన వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు, మర్రి బాబ్జి, జువ్వల రాంబాబు, టి.అరుణ్, కప్పల వెలుగుకుమారి, భానుచందర్, పతివాడ రమేష్, కాశి నవీన్‌కుమార్, ముసురుమర్తి ఆనంద్, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబూరాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










