సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాల నేతల అరెస్టు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని తిరుమలాయపాలెంలో దళితులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడి సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, కెవిపిఎస్, డిహెచ్‌పిఎస్ చేపట్టిన దళిత భరోసా యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని గోకులం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తిరుమలయపాలెం గ్రామానికి తరలి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. అంతలో త్రీ టౌన్ సిఐ మధుబాబు వారిని అడ్డుకుని తిరుమలాయపాలెంలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిఎస్‌పి కడలి వెంకటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు అనుమతి లేదని డిఎస్‌పి తేల్చి చెప్పారు. పోలీసుల దాడితో బిక్కుబిక్కుమని ఉన్న దళితులకు భరోసా ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు స్పష్టం చేశారు. సిఐ మధుబాబు నేతత్వంలో పోలీసులు వామపక్ష నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరును వారు ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. తాటిపాక మధు, టి.అరుణ్‌ను ఎత్తుకెళ్లి జీపులో వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అరుణ్, మధు మాట్లాడుతూ తిరుమలాయపాలెంలో దళితులపై జరిగిన దాడి దారుణం అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. దళితులపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తాము పెట్టిన విగ్రహాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గ్రామంలోని దళితులు అడ్డుకుంటే వారిపై దాడికి పాల్పడటం ద్వారా పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవరిస్తున్నారో తెలుస్తోందన్నారు. బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడాన్ని వారు ఖండించారు. బాధితులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టు చేసిన వారిలో పవన్, పూర్ణిమ రాజు, కొండ్రపు రాంబాబు, జవ్వల రాంబాబు తదితరులు ఉన్నారు. అరెస్తయిన నాయకులను మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, టిడిపి నాయకుడు బొర్రా చిన్నిబాబు, జైభీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కురువెళ్లి భానుచందర్ పరామర్శించారు.










