బిజెపితో అంటకాగితే వైసిపి, టిడిపి, జనసేనలకు గుణపాఠం తప్పదు
ప్రచార భేరి బహిరంగ సభలో వక్తలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
దేశానికి పట్టిన గ్రహణం బిజెపి అని, దాన్ని గద్దె దించకపోతే పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర హక్కులు కూడా కనుమరుగవుతాయని పలువురు వక్తలు అన్నారు. బిజెపితో అంటకాగితే వైసిపి, టిడిపి, జనసేనలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సిపిఎం, సిపిఐ ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ప్రధాని మోడీ చెబుతున్న అచ్చేదిన్ ఎవరికి వచ్చిందని ప్రశ్నించారు. మోడీ స్నేహితునికి దేశంలోని పోర్టులు, విమానాశ్రయాలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా కట్టబెట్టారన్నారు. ఫలితంగా రూ.30 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు అధిపతిని చేశారని వివరించారు. మరోవైపు దేశంలో నిత్యావసర సరుకులు ధరలు మండిపోతున్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర హామీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్‌కోడ్‌లుగా మార్చి హక్కులు హరించారని తెలిపారు. మోడీ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తున్న పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని వివరించారు. తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటి వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు వంటివి ఉదాహరణగా చెప్పారు. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన ఇబ్బందులను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిన దాఖలాలు లేవని తెలిపారు. కేరళలో సిపిఎం ప్రభుత్వం కరోనా కాలంలో అక్కడి ప్రజలకు సేవలు అందించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు గొంతు నులిమే ప్రయత్నం జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు నినాదంతో 800 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టనున్నామని తెలిపారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనుస్మృతి అమలు చేసేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి ప్రభుత్వానికి పాలించే హక్కులేదన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు చేపట్టిన ప్రచార భేరికి విశేష మద్దతు లభించిందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ మాట్లాడుతూ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఎర్రజెండా సత్తా చూపిస్తామని తెలిపారు. మేడే విజయవంతం చేసేందుకు కార్మికులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అనతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, శ్రామిక మహిళా నాయకులు కె.బేబిరాణి పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన ప్రజలు










