Feb 05,2023 15:32
  • ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించండి
  • ధవళేశ్వరం గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్

ప్రజాశక్తి - ధవలేశ్వరం : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ధవళేశ్వరం గ్రామం తీవ్ర సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. ఆదివారం ధవళేశ్వరం సిఐటియు కార్యాలయంలో సిపిఎం  గ్రామ విస్తృత సమావేశం కర్రి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్  మాట్లాడుతూ ధవలేశ్వరం గ్రామంలో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని తక్షణమే ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని డిమాండ్ చేశారు.  ధవళేశ్వరం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిపోయి ప్రజలకు రక్షణ లేనటువంటి పరిస్థితి 6 నెలల కాలంలో పదిమంది పైగా దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ శాంతి భద్రతలను పునరుద్దరించే ప్రత్యేక ప్రణాళికని రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా బయటి తిరగలేని పరిస్థితి ఉండటం చాలా విచారకరమని అన్నారు. యువతను గంజాయి మాఫియా ఉచ్చు నుంచి విడదీయాలని వాళ్ళ జీవితాలని కాపాడాలని దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికని ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా చర్చించి అమలు చేయాలని కోరారు.  సిపిఎం నగర్ కార్యదర్శి బి.పవన్, సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.ఎస్.మూర్తి, టి.సావిత్రి, పడల.రామకృష్ణ, ప్యారి,  ఉమామహేశ్వరరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.