Feb 19,2023 15:10

ప్రజాశక్తి-కడియం : ఉజ్వల భవిష్యత్తు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్  సందీప్ మృతి బాధాకరమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి తెలిపారు. పుత్ర వియోగం పొందిన కడియం ఎంపీడీవో రత్నకుమారిని పరామర్శించిన గోరంట్ల సందీప్ మృతి పట్ల ఘన నివాళులు అర్పించారు. ఆదివారం సందీప్ అంతిమ సంస్కారం కొవ్వూరులో జరిగింది. ఈ సందర్భంగా పలువురు రత్నకుమారిని పరామర్శించి ఓదార్చారు. ఎంపీడీవోని పరామర్శించిన వారిలో టిడిపి నాయకులు అన్నందేవల చంటి, వెలుగుబంటి నాని, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లబొయిన శ్రీనివాసు, ఉమ్మడి దేవి, ఎంఈఓ లజపతిరాయ్, మండల పరిషత్ సూపర్డెంట్ చందర్రావు, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.

  • కుమిలిపోతున్న ఎంపీడీఓ

ఎన్నో దేవుళ్ళకు మొక్కితే పుట్టావు. జీవితాంతం తోడుంటానని మురిపించావు. నవ్వుతూ, నవ్విస్తూ, విచారం లేని ఆహ్లాద ప్రపంచాన్ని చూపించావు. 30 ఏళ్ళు వచ్చినా చంటి కుర్రానిలా అమ్మ మంత్రమే జపించావు. మాతృ బంధంలో  బంధించి ఈ లోకం నుండి నిష్క్రమించావు. నాన్నా సందీప్ ఈ అమ్మకు ఇంత అన్యాయం చేస్తావా.. లే నాన్నా.. అంటూ కుమారుని పార్థివ దేహం ముందు కడియం ఎంపీడీఓ విలపిస్తున్న తీరు పరామర్శకుల్ని కంటతడి పెట్టించింది. రోగమే కదా అమ్మ దగ్గరికి వెళ్తే ఇట్టే మాయం అవుతుందని హైదరాబాద్ నుండి వచ్చేసావు. అమ్మ ప్రేమ యమపాశం ముంది ఓడిపోయిందoటు ఆమె తల్లడిల్లిపోయారు. ఇలాంటి కష్టం ఏ తల్లికి కల్గకూడదంటూ చెమర్చిన కళ్ళతో పలువురు వ్యాఖ్యానించారు.