Mar 04,2023 15:25
  • గాది నాటికి రాష్ట్రంలో 5 లక్షల గృహాల గృహప్రవేశానికి సన్నాహాలు చేస్తున్నాం
  • ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్
  • కలెక్టర్ కే. మాధవీలత 

ప్రజాశక్తి-చాగల్లు : జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం చాగల్లు గ్రామంలో జగనన్న కాలనీ కొత్తలే అవుట్ లను కలెక్టర్ పరిశీలించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క లబ్దిదారుడు ప్రభుత్వం ఉచితంగా అందచేసిన ఇంటి స్థలంలో త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీకు అందచేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇతరులు అక్రమించుకోవడం గానీ, పక్క ఇంటి వారి ప్రహరీ గోడ మన స్థలంలో నిర్మించుకునే అవకాశం ఉందని అన్నారు. ఇంటి నిర్మాణం కొంత శ్రమతో కూడుకున్నా, మీ తరువాత వారసులకు ఒక ఆస్తి హక్కు కల్పించే చక్కని అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇసుక, ఇతర నిర్మాణ ముడిసరుకులు, నీటి వసతి కల్పించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. మీరు ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగితే, ఆమేరకు దశల వారీగా చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు మీ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఎవరైనా సొంత ఇంటిని కనీస కుటుంబ అవసరాలైన విద్య, వైద్యం, ఇతర కుటుంబ ఖర్చుల తరువాత మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. ఐతే ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి, అందుకు అనుగుణంగా అవసరమైన మేటిరియల్, సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు.