ప్రజాశక్తి - సీతానగరం : 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని జిల్లా సమన్వయకర్త కె. సతీష్ బాబు తెలిపారు. గత సంవత్సరం కొవ్వూరు మండలం మద్దూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని తూర్పుగోదావరి జిల్లా నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావడం హర్షనీయం అన్నారు. బుధవారం స్థానిక సీతానగరం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఒ స్వామి నాయక్ చేతులమీదుగా బాలల సైన్స్ పోస్టర్ విడుదల చేశారు. 31 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు సంబంధించి ఈ నెల 29,30 తేదీలలో సైన్స్ ఉపాధ్యాయులకు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సైన్స్ ఉపాధ్యాయులు అందరు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారని జిల్లా కోఆర్డినేటర్ కె సతీష్ బాబు అన్నారు. ఈ నెల 29 న రాజమహేంద్రవరం డివిజన్ లో గల పది మండలాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులకు ఎస్ కె వి టీ స్కూల్ రాజమండ్రిలో, 30 వ తేదీన కొవ్వూరు డివిజన్ లో ఉన్న తొమ్మిది మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు గవర్నమెంట్ హై స్కూల్ కొవ్వూరులో జరిగే ఒరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. వివరాలకు జిల్లా కోఆర్డినేటర్ కె. సతీష్ బాబు 9059111210,జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఎం. ఎస్. రేఖ 9866189521, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్. శ్రీనివాస్ నెహ్రు 9490351351 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కె. సతీష్ బాబు, ప్రధానోపాధ్యాయులు ఎం వీరభద్రరావు, తమ్మయ్య, సీఆర్ పీ బేగం తదితరులు పాల్గొన్నారు.










