- విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ- కలెక్టర్ మాధవీలత
ప్రజాశక్తి - ధవలేశ్వరం: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కళాశాలలో మొదటి సంవత్సర పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె.మాధవీలత మాట్లాడుతూ, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో 37,288 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల కోసం పూర్తి స్థాయి లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష తరగతిలో పరీక్షలు సజావుగా రాసేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల ను, తరగతి గదిలో త్రాగునీటి వసతిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి తరగతి గదిలో సిసి కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు మాధవీలత తెలియచేశారు. కంట్రోల్ రూం ద్వారా పరీక్షల నిర్వహణ విధానాన్ని పర్యవేక్షణ చెయ్యడం జరుగుతున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసి , రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతి కేంద్రానికి బస్సు, ఆటో లతో కూడిన రవాణా వ్యవస్థ కల్పించడం జరిగిందన్నారు. ఎక్కువ మంది ఒక చోట నుంచి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు వివరాలు తెలియ చేస్తే పరీక్ష సమయాల్లో ఆయా రూట్ల లో రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకుని వస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. బుధవారం స్థానిక ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ కేంద్రంలో సుమారు 15 తరగతి గదుల్లో 430 మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.










