ప్రజాశక్తి-రాజమహేంద్రవరం చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. నగరంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పార్లమెంట్‌లో బిల్లు పెట్టిస్తామన్నారు. బిసిలకు రాజ్యాధికారం దక్కాలంటే రిజర్వేషన్లు తప్పనిసరిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎపిలో సిఎం జగన్ మోహన్ రెడ్డి బిసిలకు అన్ని విధాలుగా ప్రాధాన్యతాస్తున్నాన్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, ఎంఎల్‌సి పదవుల్లో బిసిలకు అగ్ర తాంబూలం ఇచ్చారన్నారు. పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టేలా అన్ని రాజకీయ పార్టీలనూ కలిసి విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సిఎం జగన్ ఏర్పాటు చేసిన 56 బిసి కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య చెప్పారు. బిసిల ధర్మ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. బిసిలకు అన్ని రంగాల్లో సమాన వాటా సాధించేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బిసి జనగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.










