పాడైన మోటార్లతో అందని సాగునీరు
ఈ ఏడాది ముఖం చాటేసిన వర్షాలు
ఎండుతున్న పొలాలతో రైతుల్లో ఆందోళన
ప్రజాశక్తి - రాజానగరం
మెట్టప్రాంతంలో పొలాలకు గోదావరి జలాలను అందించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యానికి అధికారులు, సర్కారు నిర్లక్యం తూట్టు పొడుస్తున్నాయి. మెట్టలో ఏడు మండలాలకు నీరందించాల్సిన ఈ పథకం నేడు పనికిరాకుండా పోయింది. పథకాన్ని ప్రారంభించి రెండు దశాబ్ధాలు పైబడినా ఏనాడు లక్ష్యానికి అనుగుణంగా నీరందించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది వర్షాలు సైతం ముఖం చాటేయడంతో చాగల్నాడు ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వరిలో కీలకమైన పొట్టదశలో నీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
2002వ సంవత్సరంలో చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని రూ.80కోట్లతో ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, రంగంపేట, కోరుకొండ, బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లో 35 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకంలో భాగంగా కాతేరు, కోలమూరు, పాలచర్లలో పంపుహౌస్‌లు నిర్మించారు. గోదావరి నుంచి నీటిని సుమారు 48 మీటర్ల ఎత్తుకు ఈ మూడు పంపు హౌస్‌ల నుంచి అంచెలంచెలుగా ఎత్తిపోస్తూ ప్రధాన కాలువకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో పంపు హౌస్లఓ మూడు చొప్పున మొత్తంగా తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేశారు. ప్రతి పంపుహౌస్‌లో రెండు మోటార్లతో నీటిని తోడుతూ, ఒక మోటార్‌ను ప్రత్యామ్నాయంగా ఉంచారు. ప్రస్తుతం పాలచర్లలో ఉన్న మూడు మోటార్లలో రెండు మోటార్లు పూర్తిగా పాడయ్యాయి. వీటిని నుంచి నీరు సరఫరా కావట్లేదు. మిగిలిన ఒక్క మోటారు నుంచే నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా రాజానగరం మండలానికి కూడా పూర్తిస్థాయిలో నీరందట్లేదు.
ఇదీ ఆయకట్టు...
ఈ ఎత్తిపోతలతో చాగల్నాడు ప్రాంతంలోని రాజమహేంద్రవరంరూరల్ మండలంలో 1,151, కోరుకొండలో 1,666, రాజానగరంలో 8,875, రంగంపేటలో 13,548, బిక్కవోలులో 4,975, అనపర్తిలో 2,439, మండపేటలో 1,654 ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది కాని రాజమహేంద్రవరం రూరల్‌లో 200, కోరుకొండలో 300, రాజానగరంలో 7వేలు, రంగంపేటలో 2,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లో పిల్లకాలువలను ఏర్పాటు చేసినా వాటిలోకి ఏనాడు నీరు వచ్చిన జాడ లేదు.
ప్రతి ఏడాది జులైలో ఈ పథకం ద్వారా నీరు విడుదల చేస్తారు. మోటార్ల మరమ్మతుల కారణంగా ఒక పంపు హౌస్ ద్వారా ఆగస్టు నెలలో నీటిని విడుదల చేశారు. పది రోజుల అనంతరం ఇదికూడా పాడైంది. ఎట్టకేలకు మరమ్మతులు చేయించి పది రోజులు నుంచి ఒక మోటారు ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రాజానగరం, రంగంపేట మండలాల్లో గ్రామాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరిచేలు పొట్ట, పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ దశలో నీటితడులు చాలా అవసరం, ఈ దశలో నీరులేక పొలాలు ఎండిపోతున్నాయి. వర్షం లేదా ఎత్తిపోతల నీరు అందకపోతే సుమారు 7వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిలే ప్రమాదం ఉంది. కొంత మంది బోర్లు ఉన్నవారు మాత్రం పొలాలకు తడులు పెట్టుకుంటున్నారు. బోర్లు లేని వారు నీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక్క రాజానగరం మండలంలో ఈ ఏడాది సుమారు 13వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఇదే పరిస్థితి ఉంటే ఈ పంట చేతికందే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు కూడా లేవు...
ఈ ఏడాది ఎనిమిది కుంచాల్లో వరి పంట వేశాను. ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. చాగల్నాడు నీరు లేక, వర్షాలు రాక పంట ఎండిపోతోంది. ఇప్పటికే రూ.20వేల వరకూ పెట్టుబడిపెట్టాను.మరో రూ.10 వేల వరకూ ఖర్చుఅవుతుంది. ఒక వేళ వర్షాలు కురిసి పంట చేతికొచ్చిన్నా రూ.30 వేలు కూడా వచ్చే అవకాశం లేదు. తిండి గింజలైనా వస్తాయో రావో తెలీని పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలి.
- చింతల వీరవెంకటమూర్తి, రైతు, చక్రద్వారబంధం
నెలాఖరుకు కోతలు మొదలు...
మండలంలో ఈ నెలఖరుకు కొన్ని గ్రామాల్లో వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఈనె దశలో ఉంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. వెన్ను వచ్చిన పంటకు తేలికపాటి వర్షాలు వచ్చినా సరిపోతుంది.
- షేక్ ఇమామ్‌కాశీమ్, మండల వ్యవసాధికారి, రాజానగ
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
పాలచర్ల పంపు హౌస్‌లో రెండు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. ఒక్క మోటారు ద్వారానే సాగునీటిని అందించాల్సి వస్తుంది. మోటార్లను బాగు చేయించేందుకు తరలించాము. రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్న ఒక్కదానితో నీటిని విడుదల చేస్తున్నాం.
- ప్రసన్నకుమార్, జెఇ, చాగల్నాడు ఎత్తిపోతల పథంరం
పంట ఎండిపోతోంది...
ఈఏడాది వర్షాలు కురవపోవడంతో పంట మొత్తం ఎండిపోతోంది. పొట్టదశలో తడి లేక బీటలు వారుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సాగునీరు అందకపోలే పంటను మొతం కోల్పోతాం.
- కట్టా ప్రసాద్, రైతు, చక్రద్వారబంధం










