ప్రజాశక్తి-కడియం : మండలంలోని కడియపులంక జాతీయ రహదారిపై మంగళవారం కడియం పోలీసులు 20 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని, 20 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. కడియం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు కడియపులంక జాతీయ రహదారిపై వెంకాయమ్మ పేట సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, రాజమహేంద్రవరం వైపు నుండి అనుమానాస్పదంగా మూటలతో వస్తున్న వాహనాన్ని గుర్తించారు. 20.330 కేజీల గంజాయితో పాటు, 20వేల రూపాయలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పోలంకి సుబ్బరాజు, ఇదే గ్రామానికి చెందిన గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఉంటున్న మర్రి శామ్యూల్, విజయవాడకు చెందిన షేక్ నిరీక్షణ్ (మైనర్ బాలుడు) లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నర్సీపట్నం ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయించి ఈజీ మనీ సంపాదిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచిన్నట్లు తెలిపారు.










