Feb 08,2023 23:21

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మైనారిటీలను వంచించిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ విమర్శించారు. స్థానిక బిలాల్‌ ఫంక్షన్‌ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నగర అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్‌, ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. విజయవాడలో ఒక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సిఎం వైఎస్‌.జగన్‌, వైసిపి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హామీలను అమలు చేయమన్న అమాయక ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టారన్నారు. గుంటూరులో మైనారిటీ బాలికపై అత్యాచారాన్ని నిరసిస్తూ న్యాయం చేయమని రోడ్డెక్కిన ముస్లిములపై హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ముస్లిం సమాజం ఎన్నటికీ మరువదన్నారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులో తన డైరెక్టర్ల ద్వారా కోర్టు కేసులు వేయించి బోర్డు ఏర్పాటుకాకుండా కుట్రలు చేయడమే కాక ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని, చెప్పారు. బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్‌ బోర్డులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమాఅని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో హబీబుల్లా ఖాన్‌, షేక్‌ నిజాం, షేక్‌ చానా, ఆరిఫుల్లా ఖాన్‌, సయ్యద్‌ మదిని, గౌస్‌ రఫీ, సయ్యద్‌ అస్లాం, జఫ్రూల్లాఖాన్‌, న్యామతుల్లా ఖురేషీ, సయ్యద్‌ అల్తాఫ్‌, అసదుల్ల కురేషి, నజీబుల్లా ఖురేషి, ఇనాముల్లా ఖురేషి, ఆఫ్ఫాన్‌ ఖురేషి, ఖలీల్‌ భారు తదితరులు పాల్గొన్నారు.