ప్రజాశక్తి - రంగంపేట(రాజానగరం)
ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన 'చలో ఢిల్లీ'కి సంబంధించి పోస్టర్‌ను సిఐటియు జిల్లా నాయకులు కొండా వెంకటలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం వెంకటలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం రంగ సంస్థలను, ప్రజల సంపదను విదేశీ స్వదేశీ సంస్థలకు అప్పగిస్తుందన్నారు. తద్వారా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లుకు అప్పగించేందుకు చూస్తుందన్నారు. మోడీ పాలనలో అన్ని ధరలూ ఆకాశాన్నంటాయన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










