ప్రజాశక్తి -రాజమహేంద్రవరం మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కరపత్రాన్ని శనివారం స్థానిక శ్యామల సెంటర్‌లోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు టిఎస్.ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, జిల్లా కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా కమిటీ సభ్యులు బి.పవన్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను విదేశీ స్వదేశీ సంస్థలకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు భారత వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసిందని, వాటికి వ్యతిరేకంగా దేశంలో రైతాంగం ఏడాదిపాటు ఢిల్లీని దిగ్బంధించిందని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రూ.400 ఉన్న గ్యాస్ బండ రూ.1200కు చేరిందని, రూ.55 ఉండే లీటరు పెట్రోలు రూ.110 దాటిందన్నారు. మోడీ ప్రభుత్వ వినాశనకర విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతన రూ.26,000, రూ.కనీస పెన్షన్ రూ.10,000 ఇవ్వాలని, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరించాలని, రైతుల పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ పనికి కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, అధిక ధరలు అరికట్టాలని, సామాజిక న్యాయం పాటించాలని, అందరికీ నాణ్యమైన విద్య వైద్యం అందించాలని, భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర 14 డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.










