Mar 16,2023 23:29

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వైసిపి ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ మరోసారి జిల్లా వాసులను నిరాశపరిచింది. ఉమ్మడి జిల్లాకు తగిన నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టును గాని ఇతర సాగునీటి పారుదల రంగానికి గానీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాల్సి ఉంది. దానికి కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమైన పర్యాటక, పారిశ్రామిక అభివద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం గతంలో మంజూరు చేసిన ఉప్పాడ హార్బర్‌ పనులను మాత్రమే బడ్జెట్లో ప్రస్తావించారు. గోదావరి డ్రైన్ల ఆధునీకరణ పనుల చేయాల్సి ఉన్నా నిధులు కేటాయించలేదు. ఇలా పలు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జిల్లా వాసులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ఆధునీకరణకు గతేడాది రూ.61 కోట్లు కేటాయించారు. నిధులు కొరత వల్ల ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు లేదు. దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కీలకమైన గేట్ల ఆధునీకరణను విస్మరించడంతో ఉమ్మడి జిల్లా వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఇసుక పూడిక పనులు చేయడానికి గతంలో టెండర్లు పిలిచినా నేటికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక (ఎన్‌ఆర్‌సిపి) కింద 'గోదావరి నది కాలుష్య నివారణ, పరిరక్షణ' ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022లో రూ.88.43 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.416 కోట్లుగా అంచనా వేశారు. కానీ కేంద్రం రూ.88.43 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో సంయుక్తంగా చేపట్టాలి. రాష్ట్ర వాటా నేటికీ కేటాయించలేదు. పారిశ్రామిక అభివద్ధి, ఉపాధి కల్పన ఊసే ఎత్తలేదు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.6.50 లక్షలకు బదులు రూ.10 లక్షల ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్లో చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించడంతో జిల్లా రైతాంగం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో కీలకమైన వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా రాలేదు. యువతకు ఉపాధి కల్పించే రంగాన్ని విస్మరించారు. స్థూల ఆదాయంపై అంకెల గారడీ వినిపించారు. ఇళ్ల నిర్మాణానికి కేటాయింపులు సాధారణంగానే ఉన్నాయి.
నాలుగేళ్లయినా రాష్ట్ర వాటా ఏదీ.?
కీలకమైన కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పూర్తి కావడం కోసం కోనసీమ ప్రజానీకం 20 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా రైల్వే బడ్జెట్‌లో మొత్తం రూ.1100 కోట్లు కేటాయించింది. మొత్తం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు సంబంధించిన నిధులు కేటాయింపు చేయని కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.350 కోట్లు రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉన్నా ఈ బడ్జెట్‌ లో కూడా ఒక్క రూపాయి కేటాయించలేదు.
కీలక సమస్యలకు పరిష్కారం ఎప్పటికీ.?
విశాఖ-కాకినాడ మధ్య పెట్రో రసాయనాల పెట్టుబడుల కేంద్రం రాలేదు. కాకినాడ సెజ్‌లో నేటికీ పరిశ్రమల ఊసే లేదు. జిల్లా వాసుల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే జల్‌ జీవన్‌ మిషన్‌ పనుల వేగవంతానికి అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో కేటాయించలేదు. జిల్లాలో పలు రహదారుల పనులకు భారీగా సొమ్ములు కేటాయింపులు జరగాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కాకినాడలో విడుదలయ్యే 50 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు రూ.10 కోట్లు వెచ్చించారు. కానీ నిధులు కేటాయించడం లేదు. కాకినాడలో సైన్స్‌ సెంటర్‌, గోదావరి కళాక్షేత్రం, స్టేడియం నిర్మాణం వంటి పనులకు సుమారు రూ.25 కోట్లు నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉన్న దానినీ పట్టించుకోలేదు. ఏలేరు కాలువల ఆధునీకరణకు నిధుల కేటాయింపు ప్రస్తావన రాలేదు.
కోనసీమకు మొండి చేయి
నూతనంగా ఏర్పడిన డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అభివృద్ధి కోసం ఏ రకమైన నిధులూ బడ్జెట్లో కేటాయించలేదు. ప్రధానంగా రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన అడా (అమలాపురం అర్బన్‌ డెవలప్మెంట్‌కి) నిధులు కేటాయించలేదు. కోనసీమలో ఇరిగేషన్‌ డ్రైనేజీల అభివద్ధి కోసం నిధులు కేటాయించలేదు. ఈ జిల్లాలో రూ.1.36 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుంది. కొబ్బరి సాగులో రాష్ట్రంలోనే జిల్లాది మొదటి స్థానం. ఇక్కడి ఉత్పత్తుల విలువ సుమారు రూ.736 కోట్లుగా ఉండగా ప్రత్యక్షంగా లక్ష మంది, పరోక్షంగా మరో 3 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. అయితే కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 22 మండలాల్లో 20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం రూరల్‌ సమసనలో సుమారు రూ.500 కోట్లతో ఆసుపత్రి మంజూరైనా నిధుల కొరత వేధిస్తోంది.