Jul 22,2023 00:08

ప్రజాశక్తి-అమలాపురం చేనేత కార్మికులకు చేయూతనిచ్చి వారి స్థితిగతులను మెరుగుపరిచే దిశగా వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందని రవాణా శాఖ మంత్రి పి.విశ్వరూప్‌ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, ఎంఎల్‌ఎ కె.చిట్టిబాబు, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వర్చువల్‌ విధానంలో వీక్షించారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి విశ్వరూప్‌ మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి ఏడాదీ రూ.24 వేల ఆర్థిక సహాయం అందించినట్టు చెప్పారు. వరుసగా ఐదో ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం ఆర్థిక సహాయాన్ని అందించినట్టు తెలిపారు. నేతన్నల జీవనాన్ని మెరుగుపరిచే సమున్నత ఆశయంతో ఆర్థిక సహాయం అందించి వారి ఉత్పత్తులకు స్థానికంగానే కాక అంతర్జాతీయంగా ఇ-కామర్స్‌ ద్వారా మార్కెటింగ్‌ సౌలభ్యం కల్పించినట్టు చెప్పారు. మగ్గం పైనే ఆధారపడి జీవనం సాగించే చేనేత కుటుంబాలకు అండగా నిలిచే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి భరోసాగా నిలుస్తున్నట్టు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో చేనేత రంగం కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,408 చేనేత సహకార సంఘాలు పథకానికి అర్హతను సాధించాయని, ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున మొత్తం రూ.10 కోట్ల, 57 లక్షల 92 వేలు నేరుగా వారి వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేసినట్టు చెప్పారు. అవసరమైన ముడి పదార్థాలు, నూలు ఇతర ఇన్‌పుట్‌లనుకొనుగోలు చేయడానికి అర్హులైన నేత కార్మికులకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందన్నారు. ఉత్పాదకత, సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, పవర్‌ లూమ్స్‌, హ్యాండ్లూమ్స్‌, ఇతర నేత యంత్రాల కొనుగోలు కోసం ఈ పథకం సహాయం అందిస్తోందన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు. ఈ కార్య క్రమంలో హితకారిణి సమాజం అధ్యక్షురాలు కాశీ బాల మునికుమారి, పెద్దిరాజు పాల్గొన్నారు.
సిఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 26న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, ఆర్‌డిఒ వసంత రాయుడుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.