May 05,2023 14:57

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మానవుని మనసు నిర్మలంగా ఉన్నట్లయితే జీవితం సుసంపన్నం,  ఆనందం అవుతుందన్నారు ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠం పీఠాధిపతి భంతే అనాలయో. శుక్రవారం బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బౌద్ధ ధమ్మ పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనసును పరిశుద్ధంగా ఉంచుకునేందుకు బుద్ధుడు ఆర్య అష్టాంగ మార్గమును బోధించినట్లు తెలిపారు. ఇది అందరికీ అవసరమైనదన్నారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మ పీఠం మైత్రేయ బుద్ధ విహారలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖ సంయుక్తంగా మహోత్సవాన్ని నిర్వహిస్తుందని అనాలయో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల వికాస కేంద్రం, పాలిటెక్నిక ప్రవేశ పరీక్షకు ఉచిత బోధన అందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి సుబ్బారావు, మల్లిన సత్యనారాయణ, బూరుగుపల్లి కళారావు, గంటా వెంకట్రావు, చిట్టూరి ఉషారాణి, ఆళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.