Feb 22,2023 23:47

భవిత కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
తాడితోట మున్సిపల్‌ ఎంపి స్కూల్‌ భవిత ఉప కేంద్రంలో కలెక్టర్‌ కె.మాధవీలత బుధవారం తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో ఆమె మాట్లాడారు. పాఠశాలలో చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానసిక పరిపక్వత, శారీరక దారుఢ్యం పెంపు దిశగా చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికపై ఆరా తీశారు. మానసిక ఆరోగ్య స్థాయి పెంచే విధానంలో నిరంతర అభ్యాస ప్రక్రియను చేపట్టడం జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫిజియోథెరపిస్టుల ద్వారా క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తున్నామన్నారు. రెగ్యులర్‌గా వైద్యపరీక్షలను నిర్వహించి మందులు అందిస్తున్నామని కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థులకు అందుతున్న ఫిజియోథెరపీ సేవలను డాక్టర్‌ మధుశ్రీ కలెక్టర్‌కు వివరించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు పింఛను అందించడం పట్ల కలెక్టర్‌కు పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా పిల్లలకు పెన్షన్‌ సౌకర్యం లేకపోతే వారి వివరాలు అందచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పిల్లలందరికీ శాశ్వత సదరం సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిఎఅండ్‌హెచ్‌ఒ, డిఆర్‌డిఎ పీడీ, డిఇఒలనుకలెక్టర్‌ ఆదేశించారు.
మధ్యాహ్న భోజనంపై దిశా నిర్దేశం
అనంతరం ఎన్‌విఆర్‌ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్‌ మాధవీలత పరిశీలించారు. వారంలో ఏ రోజు ఏ రంగు స్టాంపు వేసిన కోడిగుడ్లు వస్తున్నాయనే సమాచారాన్ని బోర్డులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిర్వహణలో ప్రతి అంశం పట్ల ప్రధానోపాధ్యాయులు పూర్తి నిబద్దతతో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం నెలలో ఏ వారంలో ఏ రంగు స్టాంప్‌ ఉన్న కోడి గుడ్డు అందజేస్తున్నారో, బహిరంగంగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట డిఇఒ ఎస్‌.అబ్రహాం, అర్బన్‌ రేంజ్‌ డిఐ బి.దిలీప్‌కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ సుభాషిణి, ఐసిడిఎస్‌ పీడీ, ఎన్‌విఆర్‌ స్కూల్‌ హెచ్‌ఎం కె.డేవిడ్‌లివింగ్‌స్టన్‌, సమగ్ర శిక్షా కో-ఆర్డినేటర్‌ స్నేహలత, నాన్‌ భవిత సెంటర్‌ ఐఆర్‌టి టీచర్‌ వరలక్ష్మి, సిఆర్‌పి జయంతి శాస్త్రి పాల్గొన్నారు.